Nandhyal | నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మహానంది మండలం సీతారామపురంలో జరిగిన అల్లర్లలో వైసీపీ నేత సుబ్బరాయుడు హత్యకు గురవ్వడానికి పోలీసుల అలసత్వమే కారణమని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో బాధ్యులైన సీఐ, ఎస్సైని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
సీతారామపురంలో శనివారం అర్ధరాత్రి 12.20 గంటల ప్రాంతంలో టీడీపీ నేత బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి పసుపులేటి సుబ్బరాయుడి ఇంట్లోకి వెళ్లి కిరాతకంగా హత్య చేశారు. అయితే తమపైకి టీడీపీ నాయకులు దాడికి వస్తున్నారని వైసీపీ నేత నారపురెడ్డి పోలీసులకు కాల్ చేశారు. కానీ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాదాపు 40 మంది తమపైకి వస్తున్నారని ఫోన్ చేసి చెప్పినప్పటికీ మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్, ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే అక్కడికి వెళ్లారు. పైగా ఈ పరిస్థితి గురించి ఉన్నతాధికారులకు సరిగ్గా వ్యవహరించలేదు.
పరిస్థితి అదుపు తప్పుతుందని అదనపు బలగాలను పంపించాలని ఉన్నతాధికారులను అడిగితే కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఈ హత్యోదంతంలో పోలీసులు వ్యవహరించిన ఉదాసీనతపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే బాధ్యులైన సీఐ, ఎస్సైపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.