తిరుపతి : తిరుమలలో (Tirumala) మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టనున్నామని టీటీడీ ఈవో జే. శ్యామలరావు (TTD EO Shyamala Rao) తెలిపారు. వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. తిరుపతిలోని పరిపాలన భవనం మీటింగ్ హాల్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుమలను పక్కా ప్రణాళికతో మోడల్ టౌన్‌గా (Model Town) తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వివరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతోపాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్‌ను కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సి ఉందన్నారు.
రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్యుమెంటును రూపొందించి మౌళిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన ఉందన్నారు. ఇందుకు టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ను సలహాదారుగా నియమించామన్నారు. తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే రెండు, మూడు నెలల్లో తొలగిస్తామని ఈవో తెలిపారు.