అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ సర్వే ప్రాజెక్టుకు నల్సార్ మద్దతుగా నిలిచింది. రీ సర్వే ప్రాజెక్టుకు చట్టపరమైన మద్దతు అందించేందుకు సిద్ధమైన నల్సార్ అధికారులు ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం కోసం చట్టపరమైన సహకారం నల్సార్ అందించనున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఏండ్ల తర్వాత వ్యవసాయ, వ్యవసాయేతర భూములపై భారీ రీసర్వే చేపట్టింది. రాష్ట్రంలోని భూములను సర్వే చేసి జియో క్వాడ్రంట్లతో నంబర్లు వేస్తారు. ఈ ప్రాజెక్ట్‌కు చట్టపరమైన హక్కులను రూపొందించడం, సమీక్షించడం, సిద్ధం చేయడంలో చట్టపరమైన మద్దతు అవసరమవుతుంది. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతోపాటు లీగల్ రీసెర్చ్ చేపట్టడం, భూ వివాదాలను పరిష్కరించడం, రైతులకు చట్టపరమైన అవగాహన కల్పించడం వంటివి నల్సార్ చేపట్టనున్నది.
ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారు. రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో 3 సంవత్సరాల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్సార్‌తో ఎంఓయూ చేసుకున్న నేపథ్యంలో భూ రీసర్వే పనులు వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకంలో మొదటగా సర్వే చేపట్టనున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు వర్క్‌షాపులు, సదస్సుల నిర్వహణ కోసం నల్సార్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.