ఒంగోలు: ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పష్టతనిచ్చారు. తన కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లిక్కర్ స్కాంలో నిజానిజాలు తెలుసుకోకుండా తన కుటుంబాన్ని రోడ్డుకీడ్చడం పట్ల మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పాల్సి వస్తున్నదని విచారం వ్యక్తం చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనకు పాత్ర ఉన్నట్లుగా గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో స్పష్టత ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తమ బంధువర్గం చేసే వ్యాపారాల్లో కూడా మాగుంట అనే పేరు ఉండటం వల్ల తమపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఢిల్లీ 32 జోన్లలో వారు కేవలం 2 జోన్లలోనే తమ బంధువులు వ్యాపారం చేశారని తెలిపారు. లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ కూడా జరుగుతున్నదని, ఈడీ అధికారులు ఇళ్లు, కార్యాలయంలో సోదాలు జరిపిన సమయంలో కూడా అనుమానాలు నివృత్తి చేసినట్లు చెప్పారు.
గత 50 ఏండ్లుగా తాము మద్యం వ్యాపారంలో ఉన్నామని, తమ తండ్రి కూడా లిక్కర్ వ్యాపారం చేశారని ఎంపీ మాగుంట తెలిపారు. ప్రజాసేవలో నిమగ్నమైన తమ కుటుంబం ప్రస్తుతం లిక్కర్ బిజినెస్తోపాటు మరో వ్యాపారంలోనూ భాగస్వాములుగా లేమని చెప్పారు. తన ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయన్నారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర జరిగిందని, తన వ్యక్తిత్వంపై దాడి జరిగిందని చెప్పారు. తాను గానీ, తన కుమారుడు గానీ ఢిల్లీ లిక్కర్ బిజినెస్లో డైరెక్టుర్లు లేమని స్పష్టం చేశారు. మాగుంట కుటుంబం ప్రశాంతమైన రాజకీయాలను ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తుందని, తమ కుమారుడు రాఘవరెడ్డి ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేయడం ఖాయమన్నారు.