న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. టీడీపీ నాయకులు రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలోని పేదలకు అన్యాయం చేస్తున్నారని, పేదల ఇళ్ల స్థలాలాకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి కారణంగానే రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్నదని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కూడా పాత్ర ఉంటుందని, నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉన్నదని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అభిప్రాయపడ్డారు. ఇందుకు రఘురామకృష్ణంరాజును పావుగా ఉపయోగించుకుని చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునే పని చేస్తున్నాయని మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు పేరుతో రుణాన్ని నిలిపివేయాలంటూ పిటిషన్ వేసి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గృహ నిర్మాణాలకు నిధులు రాకుండా చేయడంలో రఘురామకృష్ణంరాజు కూడా ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు.