పులివెందుల: కడప జిల్లా పులివెందులలో (Pulivendula) ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో కడప ఎంపీ, వైసీపీ నేత అవినాశ్ రెడ్డిని (MP Avinash Reddy) అరెస్టు చేయడానికి తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దీంతో ఆయన నివాసం వెలుపల నిరసనకు దిగారు. అయితే బలంవంతంగా కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి కడపకు తరలించారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకున్నది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.
కాగా, పులివెందుల, ఒటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ కొనసాగనున్నది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. మొత్తం10,600 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. వీరికోసం 15 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఒటిమిట్ట బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 24,600 మంది ఓటు వేయనున్నారు.