అమరావతి : గుంటూరులో రెండు రోజుల పాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ నేతలందరూ అవాస్తవాలే మాట్లాడారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్లీనరీ చేసిన తీర్మానాలన్నింటి పైనా బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో రాజ్యాధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని, ఆ దిశగా పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు.
కేంద్రం అందజేస్తున్న నిధులతోనే ఏపీలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ నిర్మిస్తే పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించవచ్చని అన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా ముందుకు వెళ్తుందని ఆరోపించారు.
ప్లీనరీలో వైఎస్ జగన్ ను పొగడ్తలతో ముంచెత్తడమే తప్పా చేసింది ఒరిగిందేమి లేదని విమర్శించారు. ప్రతిపక్షాలను తిట్టడమే ప్రధాన లక్ష్యంగా ప్లీనరీ కొనసాగిందని ఆయన దుయ్యబట్టారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సోము వీర్రాజు అన్నారు.