AP Weather | వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు సమీపంలో తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలిందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశవగా కదులుతూ రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా బలహీన పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర, యానాంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములతో కూడిన మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరికలు జారీ చేశారు.