MLC elections : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduates MLC) స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teachers MLC) స్థానానికి ప్రశాంతంగా పోలింగ్ (Polling) కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు (Krishna – Guntur) జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, తూర్పుగోదావరి (East Godavari), పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలో 25 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో రాజేంద్రప్రసాద్ (అధికార ఎన్డీఏ కూటమి), లక్ష్మణరావు (పీడీఎఫ్) మధ్య ప్రధాన పోటీ నడుస్తోంది. 800 లోపు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలకు 2 బ్యాలెట్ బాక్సులు, 800 కంటే ఎక్కువ మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలకు 3 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. 483 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా పోలింట్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.
పోలింగ్ బందోబస్తు విధుల్లో 3,254 మంది పోలీసులు ఉన్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానం పరిధిలో 3,47,116 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 123 పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో ముగ్గురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంది. రఘువర్మ (APTF), శ్రీనివాసులు (PRTU), విజయగౌరి (UTF) ప్రధానంగా పోటీ పడుతున్నారు. మొత్తం 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇక తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బరిలో 35 మంది అభ్యర్థులు ఉండగా.. రాజశేఖరం (అధికార కూటమి), రాఘవులు (పీడీఎఫ్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 3,14,984 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 545 మంది ప్రిసైడింగ్, 545 మంది సహాయ ప్రిసైడింగ్ సిబ్బంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 2,714 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల సందర్భంగా 1,199 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు.