అనంతపురం : కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అరాచకాలకు అంతేలేకుండా పోతున్నదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తమ వెనక ఉన్నారన్న నమ్మకంతో వారు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. కుప్పంలో టీడీపీ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు రోజురోజుకు ప్రజాదరణ కోల్పోతున్నారని, ఉనికి కాపాడుకునేందుకే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన ఆరోపణలపై తోపుదుర్తి స్పందించారు.
పరిటాల కుటుంబం దౌర్జన్యాలపై పోరాటానికి సిద్ధమని ఎమ్మెల్యే తోపుదుర్తి చెప్పారు. చెన్నేకొత్తపల్లి వైస్ సర్పంచ్ రాజారెడ్డిని కిడ్నాప్ చేస్తున్న వారిని అడ్డుకోవడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. పోలీసులను తిట్టడం, వారిని అడ్డుకోవడం పరిటాల కుటుంబానికి అలవాటుగా మారిందన్నారు. భద్రతగా ఉన్న పోలీసులను పరిటాల సునీత దుర్భాషలాడడం తగదని ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదని తోపుదుర్తి ఆరోపించారు. పరిటాల కుటుంబం ఎంత గింజుకున్నా, ఎంతటి దాడులకు దిగినా రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోసారి వైసీపీకి పట్టం కట్టడం ఖాయమన్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీపై తిరుగుబాటు మొదలైందని, రాష్ట్రంలో చంద్రబాబుకు తిరగలేరని ఏపీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని ప్రజలు విస్మరిస్తున్నారనడానికి కుప్పం ఘర్షణలే ఉదాహరణ అని చెప్పారు. టీడీపీపై బీసీల నుంచి తిరుగుబాటు మొదలైందన్నారు.