నెల్లూరు : వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గుండె సమస్యతో ఆపదలో ఉన్న చిన్నారికి అండగా నిలిచారు. అంతేకాకుండా తన వాహనంలో ప్రతినిధిని ఇచ్చి మరీ పంపి దవాఖానకు తీసుకెళ్లేలా చూశారు. వైద్యులతో స్వయంగా మాట్లాడి చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. శస్త్రచికిత్స సక్సెస్ అయి చిన్నారి కోలుకోవడంతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు చిన్నారి తల్లిదండ్రులు కొత్త బట్టలు పెట్టి కృతజ్ఞతలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉప్పటూరు గ్రామంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. ప్రజలతో కలుస్తూ వారి సమస్యలను సావధానంగా వింటున్నాడు. అదే సమయంలో గిరిజన కుటుంబానికి చెందిన పొట్లూరి స్నేహ అనే చిన్నారి గుండెలో రంధ్రంతో బాధపడుతున్నట్లు తెలిసింది. చిన్నారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీయగా వారు తమ బాధను వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తన కారు ఏర్పాటు చేసి వారి వెంట తన ప్రతినిధిని తిరుపతిలోని ప్రముఖ దవాఖానకు పంపించారు. చిన్నారి ఆపరేషన్ గురించి కోటంరెడ్డి స్వయంగా అక్కడి వైద్యులతో మాట్లాడారు. పాపను జాగ్రత్తగా చూడాలని కోరారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద చిన్నారి పొట్లూరి స్నేహకు సర్జరీ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయి చిన్నారి కోలుకున్నది.
సర్జరీ అనంతరం కోలుకున్న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి మంగళవారం చేరుకున్నది. తన అండగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్నేహ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఇంటి పెద్దన్నలా ఆదుకున్న ఎమ్మెల్యేకు చిన్నారి కొత్త బట్టలు పెట్టి తన కృతజ్ఞతను చాటుకున్నది. చిన్నారి స్నేహతో ఆప్యాయంగా ముచ్చటించి ఆరోగ్యపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి కుటుంబానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.