అమరావతి : తెలుగుదేశం పార్టీ పాదయాత్రలపై ఏపీ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ముసుగులో డబ్బున్న వారిని, తనతో తిరిగే తాబేదారుల్ని, బ్రోకర్లను, తనంటే మోజుపడే మహారాజుల్ని, తెలుగుదేశం సానుభూతిపరులు, పెట్టుబడిదారులు, ఏజెట్లు పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ యాత్రకు చేసిన పాపాలకు.. ‘పాప పరిహార యాత్ర’ అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదన్నారు.
నిజమైన రైతులను చంద్రబాబు మోసం చేశారని.. పార్టీ కండువా కప్పుకోలేని దుస్థితి టీడీపీదని, కార్యకర్తలే వాళ్ల పార్టీ జెండా పట్టుకుని యాత్ర చేయలేకపోతున్నారని విమర్శించారు. రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపార యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు అన్నీ చంద్రబాబేనని.. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆయనేనని విమర్శించారు.
యాత్ర పేరిట తన బ్లాక్ మనీని వైట్‌మనీగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. పేదవారికి అమరావతి ప్రాంతంలో ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం చెబితే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని అడ్డుకున్న వారు రైతులు ఎలా అవుతారని మంత్రి ప్రశ్నించారు. ఏ నిజమైన రైతు ఈ రకంగా ఆలోచించడని.. లోకేశ్ చంద్రన్న దేవుడు అంటున్నాడని.. ఎవరికి దేవుడో చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్‌ను మానసిక వైద్యులకు చూపించాలన్నారు.
లోకేశ్ కుప్పంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ తిరుగుతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 1989 నుంచి ఇప్పటి వరకు కుప్పానికి చంద్రబాబే ఎమ్మెల్యేగా ఉన్నారని.. హంద్రీనీవా నీళ్లు ఎందుకు తీసుకురాలేదంటూ మండిపడ్డారు. రెండేళ్లలో ఏం పీకారని లోకేశ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. గడిచిన రెండేళ్లలో చంద్రబాబు ఎందుకు ఒకసారి కూడా కుప్పానికి వెళ్లలేదని ప్రశ్నించారు. తండ్రీకొడుకులకు ఎన్నికలు రాగానే కుప్పం గుర్తుకు వచ్చిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.