వైఎస్ఆర్ జిల్లా : కడప వాసులకు శుభవార్త. జిల్లాలోని పర్యాటక స్థలాలను ప్రజలకు పరిచయం చేసేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘మన కడప’ పేరుతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే సదుపాయాన్ని అధికార యంత్రాంగం అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్యాటక ప్రాంతాల సందర్శన ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటన విశేషాలను కలెక్టర్ వీ విజయ రామరాజు మీడియాకు వెల్లడించారు.
కలెక్టర్ విజయరామరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నెలలో ప్రతి ఆదివారం, రెండో శనివారం ‘మన కడప’ పర్యాటక స్థలాల సందర్శన కార్యక్రమం అందుబాటులో ఉండనున్నది. ఇందుకోసం 40 సీట్ల సామర్థ్యం గల ఎయిర్ కండిషన్డ్ ఇంద్ర బస్సులను అందుబాటులో ఉంచారు. ఈ స్కీంలో పెద్దలకు రూ.500, 6 – 12 ఏండ్లలోపు పిల్లలకు రూ.300 చొప్పున రుసుం వసూలు చేస్తారు. పర్యాటక స్థలాల సందర్శన ప్రయాణంలో టిఫిన్, మధ్యాహ్న భోజనంతోపాటు స్నాక్స్, టీలు అందజేస్తారు.
ఈ పర్యాటక ప్రాజెక్టులో జిల్లాలోని దేవుని కడప వేంకటేశ్వర స్వామి ఆలయం, పుష్పగిరి పీఠం కామాక్షి సహిత విద్యానాదేశ్వరాలయం, వొంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం, సిధావటం కోట తదితర పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులను తీసుకువెళ్లనున్నారు. టూరిజం స్పాట్ల ప్రాముఖ్యతను వివరించేందుకు గైడ్ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని వారసత్వ ప్రదేశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ తరహా సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ పర్యాటక సందర్శన బస్సు టికెట్లు పొందేందుకు హరిత హోటల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.