Mahashivratri Brahmotsavalu | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైల పురవీధులన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు మంగళవారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
సాయంకాలార్చనలు హోమాల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన గజవాహనంపై వేంచేపు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం నిర్వహించగా.. భక్తుల జయజయ ధ్వానాలు మిన్నంటాయి. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలువీరభధ్ర స్వామి వరకు ఆద్యంతం వైభవంగా సాగింది. శోభాయాత్రలో చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, వేషధారణలు, నృత్యాలు అలరించాయి. అనంతరం కాళరాత్రిపూజ, మంత్రపుష్పం, స్వామిఅమ్మవార్లకు ఆస్థానసేవలు నిర్వహించారు.
Srisailam Temple
గజం అంటే ఐశ్వర్యానికి, అంగబలానికి, ఆదిపత్యానికి ప్రతీక. శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ లింగ మహాచక్రవర్తి. జయజయ ద్వానాల నడుమ జగన్మాత భ్రమరాంబిక అమ్మతో కలిసి అధిరోహించి దర్శనమిచ్చారు. గజవాహన సేవలో స్వామి అమ్మవార్లను దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగి.. కొండంత అండగా ఉంటానని అభయమిస్తున్నట్లుగా భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ మాడవీధిలోని భ్రామరీ కళావేదికతోపాటు పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
Srisailam Temple
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లికార్జున స్వామి పాగాలంకరణ గురువారం అర్ధరాత్రి జరుగనున్నది. ఈ కార్యక్రమంలో రాజకీయ నేతలు, పుర ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు చేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. ఈ మేరకు బందోబస్తు ఏర్పాట్లను నంద్యాల ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి పరిశీలించారు. ఎలాంటి తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ గజవాహన సేవలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు.
Srisailam Temple