తూర్పు గోదావరి జిల్లా : రాజమహేంద్రవరం పట్టణంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రం విభాగంలో క్వాంటమ్ ఫిజిక్స్ పూర్వ విద్యార్థుల సంఘం (ఆలుమ్నీ) లోగో ఆవిష్కృతమైంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం జగన్నాధరావు ఈ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం జగన్నాధరావు మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఫిజిక్స్‌కు అన్ని విభాగాలతో సంబంధాలు ఉన్నాయని, దీనిని అవకాశంగా తీసుకుని విద్యార్థులు ఫిజిక్స్‌లో రాణించేలా మార్గనిర్దేశం చేయాలన్నారు. డిపార్ట్మెంట్ల వారీగా పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేయడంలో స్పృహ సైకాలజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సుంకర నాగేంద్ర కిషోర్ అద్భుతమైన పాత్ర పోషించారని కొనియాడారు.
క్వాంటమ్ ఫిజిక్స్ పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గ సభ్యులు ఎం దుర్గాగణేష్, టీ కార్తీక్ సాయిరాం, కే నాగలక్ష్మి, ఈఎస్ఎల్ ప్రశాంతి, బీ అగర్వాల్, టీ వెంకటేజ, ఎంవీఎంటీ నాయుడు, టీ నాగ వెంకటదుర్గ, టీ సుమన్, కే నవ్య, ఎస్ శివకృష్ణ, ఈ దేవి తదితరులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో క్వాంటం ఫిజిక్స్ విభాగంలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఆలుమ్నీ చర్చించింది. త్వరలోనే కార్యాచరణను సిద్ధం చేసుకుని వెల్లడిస్తామని నిర్వాహకులు చెప్పారు.