తిరుమల : అయోధ్య (Ayodhya) శ్రీరామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం చేస్తున్నామని టీటీడీ(TTD) వెల్లడించింది. సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రత్యక్షప్రసారం ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. తమిళం(Tamil), కన్నడ(Kannada), హిందీ(Hindi) ఛానళ్లలో, అదేవిధంగా ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయోధ్యలో జరిగే వైదిక, ఆధ్యాత్మిక క్రతువులను నిరంతరాయంగా ప్రత్యక్షప్రసారం చేయనుందని తెలిపారు.
ఎస్వీబీసీ(SVBC) తెలుగు ఛానల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అనంతరం 12 గంటల నుంచి తిరుమల శ్రీవారి కల్యాణం యధావిధిగా ప్రత్యక్ష ప్రసారం అవుతుందన్నారు. ఆ తరువాత అయోధ్యలో మధాహ్నం 12 గంటల నుంచి జరిగే కార్యక్రమాలను శ్రీవారి కల్యాణం అనంతరం తిరిగి ప్రసారం చేస్తామని వివరించారు. భక్తులు ఈ విషయాలను గమనించి అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలో వీక్షించవచ్చని తెలిపారు.