AP News | ఏపీలో కొత్తగా వైన్ షాపు టెండర్ దక్కించుకున్న వారికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నిన్న నిర్వహించిన లాటరీలో వైన్ షాపు లైసెన్స్‌లు దక్కించుకున్న వారికి మద్యం సిండికేట్‌తో పాటు పలువురు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. సిండికేట్ నుంచి కాకుండా వ్యక్తిగతంగా లైసెన్స్‌లు దక్కించుకున్న వారిని టార్గెట్ చేసి తో బేరసారాలకు దిగారు. మీరు మద్యం వ్యాపారం చేయలేరు.. గుడ్ విల్ కింద నెలకు ఇంత ఇస్తాం.. మీ లైసెన్స్‌ను వదిలేయండి అంటూ ఆఫర్లు ఇచ్చారు.
మద్యం దుకాణం నిర్వహించాలంటే రూ.40 లక్షల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే తమకు లైసెన్స్‌ను అప్పగిస్తే కోటి రూపాయల నుంచి రూ.1.2 కోట్ల వరకు నగదు ఇస్తామని మద్యం సిండికెట్బంపరాఫర్లు ఇస్తున్నాయి. విజయవాడలో అయితే ఒక్కో దుకాణానికి రూ. కోటి చొప్పున ఇస్తామని.. అదే గుంటూరులో రూ.85 లక్షల దాకా చెల్లిస్తామని ఆఫర్లు ఇచ్చాయి. ఇంకొన్ని చోట్ల అయితే లైసెన్స్‌లు అప్పగిస్తే డబ్బులతో పాటు పెట్టుబడి లేకుండానే గుడ్ విల్ కింద నెలకు రూ.15 వరకు ఇస్తామని మభ్యపెడుతున్నారు.
మద్యం సిండికెట్తో రాజకీయ నాయకులు కూడా చేతులు కలిపి వైన్ షాపు లైసెన్సులు దక్కించుకున్న వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. తాము చెప్పిన దానికి ఒప్పుకోని వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. లైసెన్స్‌లు ఇవ్వకపోతే ఎటువంటి పెట్టుబడి లేకుండా తమకు 20 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు వాటా ఇవ్వకపోతే తమ నియోజకవర్గ పరిధిలో వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ అనుచరులను పంపించి మరీ వార్నింగ్‌లు ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా పల్నాడు, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, విజయవాడ, గుంటూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇది ఎక్కువగా కనిపించింది.