అమరావతి : భగవాన్ సత్యసాయి బాబా ( Sathya Sai Baba ) నిరంతరం పేదల కోసం తపించేవారని ప్రముఖ నటి ఐశ్వర్యరాయి బచ్చన్ (Aishwarya Rai Bachchan) అన్నారు. సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం సత్యసాయి జిల్లాలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi) తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandra Babu) , డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ( Sachin Tendulkar) , కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐశ్వర్యరాయి మాట్లాడుతూ భగవంతుడికి, ప్రజలకు సేవ చేయడమేనని నిజమైన నాయకత్వ లక్షణమని బాబా భావించేవారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి క్రమ శిక్షణ, అంకితభావం, దైవత్వం, దృఢ సంకల్పం కలిగి ఉండాలని బోధించేవారని తెలిపారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ప్రజలకు సైతం తాగునీరు, వైద్య సహాయం, ఉచితంగా విద్యాభ్యాసంలాంటి ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు.
సత్యసాయి జన్మించి వందేళ్లు గడిచాయని, ఆయన భౌతికంగా లేకపోయినా సేవా కార్యక్రమాలు, భోదనల ద్వారా ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉంటారని అన్నారు. విద్యా ట్రస్టుల ద్వారా విద్యార్థులకు ఉన్నత విలువలు బోధించారని వెల్లడించారు. పుట్టపర్తి, బెంగళూరు, నవీ ముంబైలల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా అంతర్జాతీయ వైద్య సేవలను ఉచితంగా అందించారని తెలిపారు.