అమరావతి : పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali) , మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌లపై ( Gorantla Madhav ) చట్టబద్ధంగానే చర్యలు తీసుకుంటున్నామని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) అన్నారు. ఏ స్థాయిలో ఉన్నవారైనా నోరు కంట్రోల్ పెట్టుకోవాలని సూచించారు. అనంతపురంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం హయాంలో తప్పుచేసిన వారిపై చట్టబద్ధంగానే చర్యలు తీసుకుంటున్నామని, అలాగని తప్పు చేసిన వారిని వదలమని హెచ్చరించారు. పోసాని అరెస్టు అంశాన్ని ఆమె ప్రస్తావిస్తూ బూతుల స్క్రిప్ట్ పంపింది సజ్జల రామకృష్ణానైనా, అనుభవిస్తోంది పోసానే కదాని అన్నారు. పోసానిపై జాలిపడే వ్యక్తుల్ని ఒక్కరినైనా చూపండి తెలిపారు.
రాజ్యాంగం వాక్ స్వాతంత్య్రం ఇచ్చిందే గానీ నోరు పారేసుకోమని చెప్పలేదని అన్నారు . ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో తప్పులు ఎవరు చేసినా శిక్ష ఒకేలా ఉంటుందని అన్నారు. పోసాని చేసిన వ్యాఖ్యలు నిరక్షరాస్యుడు కూడా చేయడని అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ అమలు చేస్తే ఒక్క వైసీపీ నేత కూడా రోడ్డు మీద తిరగరని పేర్కొన్నారు.