అమరావతి : ఏపీలో అధికార వైసీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం(Land titling) అత్యంత ప్రమాదకరమైనదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజల భూములను లాక్కొనేందుకు చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు.
వివాదం ఉందని మీ భూములను రికార్డులు తారుమారు చేస్తారని , కోర్టులకు కూడా వెళ్లేందుకు అవకాశం లేకుండా చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు. భూమి అంటే సెంటిమెంట్. దాని ముట్టుకుంటే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం , ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తానని ప్రకటించారు. సంపద సృష్టించడం, పేదలకు పంచడమే కూటమి లక్ష్యమని వెల్లడించారు.
రాబోయే ఐదేండ్లలో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ (Modi) , రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. బకాయిలతో కలిసి జులైలో రూ. 7వేలు పింఛన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతకు ముందు నంద్యాల సభలో బాబు మాట్లాడారు.