1,577 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీలోని చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణాన్ని సీఐడీ పోలీసులు చేధించారు. 1,577 ఎకరాల ప్రభుత్వ భూములను ఆన్లైన్లో తమ పేరిట మార్చుకొన్న వ్యక్తులను ఆదివారం అదుపులోకి తీసుకొన్నారు. వీరిలో ప్రధాన నిందితుడైన మోహన్ గణేష్ పిైళ్లె, మధుసూదన్, రాజన్, కోమల, రమణ ఉన్నారని, ధరణి అనే మరో నిందితురాలు పరారీలో ఉన్నదని సీఐడీ డీఎస్పీ రవికుమార్ వెల్లడించారు. వారి నుంచి 40 నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ పత్రాలతో నిందితులు రూ.500 కోట్లకుపైగా విలువచేసే భూములను కబ్జా చేశారని, 13 మండలాల్లోని భూములను విక్రయించేందుకు పథకం వేశారని వివరించారు.