హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ): కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీకాళహస్తిలో ఆత్మార్పణకు యత్నించడం కలకలం రేపింది. ఏపీలోని శైవాలయాల సందర్శనలో భాగంగా గురువారం ఆమె తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి వచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా దుస్తులు ధరించి రావాలని ఆలయ సిబ్బంది సూచించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలోనే అఘోరి తన కారులో ఉన్న పెట్రోల్ క్యాన్ తీసుకొని ఆత్మార్పణకు యత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న మహిళా పోలీసులు, స్థానికులు మహిళలు ఆమెకు నచ్చజెప్పి వస్త్రా లు కట్టారు. అఘోరిని కేవలం వస్త్రధారణతో మాత్రమే దైవదర్శనం చేసుకోవాలని కోరామని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. తనతో వారు దురుసుగా ప్రవర్తించారని అఘోరి ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్లోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించగా, పోలీసులు ఆమెను అడ్డుకొని రాష్ట్ర సరిహద్దులు దాటించారు.