అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు(Chittoor) లో చిన్నారి అతిదారుణంగా హత్యకు గురికావడం దారుణమని మాజీ మంత్రి రోజా సెల్వమణి (Roja Selvamani ) ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో పోలీసులున్నారా ? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
వారం రోజుల క్రితం రాత్రి చిన్నారి అదృశ్యమైతే పోలీసుల నిర్లక్ష్యం వల్ల నాలుగురోజుల క్రితం వాటర్ సంప్ (Water Sump) లో శవమై తేలిందని పేర్కొన్నారు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు (Police) ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆరోపించారు. ఏపీలో దారుణాలు జరుగుతున్నా సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులను కేవలం కక్షసాధింపు చర్యలకు మాత్రమే వాడుతున్నారని దుయ్యబట్టారు.
రెడ్‌బుక్‌లో రాసుకున్న వారిపై తప్పుడు కేసులు, కొట్టాలా అనే విషయంపై శ్రద్ద వహిస్తున్నారని ఆరోపించారు. బాత్రూంలో కెమెరాలు పెట్టారని గుండ్లమల్లేరు కళాశాలకు చెందిన మూడు వందల మంది విద్యార్థినులు గగ్గోలు పెడితే ప్రభుత్వం పట్టించుకోకుండా విద్యార్థులను ఇళ్లకు పంపించారని విమర్శించారు. లోకేష్ నియోజకవర్గంలో ఒకేరోజు ముగ్గురు మైనర్లపై అత్యాచారం జరగడం సిగ్గుచేటని అన్నారు.