DIG Koya Praveen | రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల విషయంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని ఇటీవల తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక పోలీసులు సైతం ఈ విషయంపై విచారణ చేపట్టారు. కేసు సంబంధించిన వివరాలను పోలీస్ అధికారులతో కలిసి డీఐజీ వివరించారు. సిద్ధిఖీ, మహ్మద్ అలీ ఉమ్మా ఉగ్రవాదులని.. ఇద్దరు దేశంలోని మూడు నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిట్లుగా చెప్పారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై విచారణ జరుపుతున్నామన్నారు. దాదాపు 50 ఐఈడీలు తయారు చేసే సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఐసిస్, అల్ ఉమ్మా ఒకే రకమైన భావజాలం కలిగి ఉంటాయని.. అల్ ఉమ్మా దక్షిణ భారత్‌లో పెద్ద ఉగ్రవాద సంస్థగా తెలిపారు. తమిళనాడు పోలీసుల తెలిపిన వివరాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
అయితే, రాయచోటిలో రిక్రూట్మెంట్, ట్రైనింగ్ ఇచ్చినట్లుగా విచారణలో నిర్ధారణ కాలేదన్నారు. పేలుడు సామగ్రి ఎక్కడి నుంచి.. ఎలా వచ్చిందనే దానిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసుపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పని చేస్తున్నాయన్నారు. నిందితులు 20 సంవత్సరాలయినా చట్టం నుంచి తప్పించుకోలేరన్న దానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ కేసులో పేలుడు పదార్థాల గురించి ఉగ్రవాదుల కుటుంబీకులకు తెలుసా లేదా? అన్నదాంట్లో అనుమానాస్పదంగా ఉందన్నారు. ఉగ్రవాదులు ఇద్దరు సాంకేతిక నిపుణులన్నారు. రాయచోటిలో స్థిరపడిన తర్వాత 2013లో బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగిన పేలుళ్లలో వీరి ప్రమేయం ఈ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని డీఐజీ పేర్కొన్నారు.
నిందితుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమ్మోనియం నైట్రేట్, గన్ పౌడర్‌తో పాటు దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్‌వర్క్‌ల మ్యాప్స్ దొరికిందని చెప్పారు. ఇటీవల రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక పోలీసులు సైతం విచారణ చేపట్టి కుటుంబీకులపై కేసు నమోదు చేశారు. అబూబకర్ సిద్ధిఖీ భార్య షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే, ఉగ్రవాదులు మారు పేర్లతో స్థానికంగా కొన్ని సంవత్సరాలుగా చీరల వ్యాపారం జరుపుతూ రహస్య జీవితం కొనసాగిస్తున్నారు. అబూబకర్ సిద్ధిఖీ రాయచోటికి చెందిన మహిళను.. మహమ్మద్ అలీ సుండుపల్లికు చెందిన మహిళను వివాహం చేసుకున్నారు.