శనివారం 06 మార్చి 2021
Andhrapradesh-news - Jan 17, 2021 , 13:07:11

కర్నూలు వాసులకు గుడ్‌ న్యూస్‌.. ఎయిర్‌ పోర్ట్‌కు డీజీసీఏ అనుమతి

కర్నూలు వాసులకు గుడ్‌ న్యూస్‌.. ఎయిర్‌ పోర్ట్‌కు డీజీసీఏ అనుమతి

అమరావతి : కర్నూలు జిల్లా ఓర్వకల్‌ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు కీలకమైన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతి లభించింది. విమాన సర్వీసులు ప్రారంభించేందుకు అనుమతిస్తూ జనవరి 15న డీజీసీఏ ఉత్తర్వులిచ్చినట్టు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. విమానాశ్రయంపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు వేగంగా నిధులు మంజూరు చేయడంతో తక్కువ సమయంలోనే కీలకమైన అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో కర్నూలు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి మరింత పరుగులు పెట్టడంతో పాటు, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఇదిలా ఉండగా.. విమానాలు నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్‌ సంస్థ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నుంచి విమానాలు నడిపేందుకు సంస్థ సుముఖంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు విమానాల సర్దుబాటు చేయడం వీలుకాదని వెల్లడించినట్లు సమాచారం.

కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి గతేడాది దసరా పండుగకు విమానాలు నడుపాలని ప్రభుత్వం భావించినా.. సాధ్యపడలేదు.. ఈ ఏడాది ప్రారంభం నుంచైనా వీలు కావడం లేదు. విమానాలు సర్దుబాటు చేయడం కష్టమని, మార్చి నుంచి నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉడాన్‌ పథకం కింద కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలు నడిపేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అనుమతులు ఇచ్చింది. ఈ మార్గాల్లో కేవలం ఇండిగో సంస్థకు మాత్రమే కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ అనుమలు జారీ చేసింది. అలాగే మరికొన్ని రూట్లలో సర్వీసలు నడిపేందుకు రాష్ట్ర విమానాయాన అభివృద్ధి సంస్థ స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌తో చర్చలు జరుపుతోంది. పూర్తిస్థాయిలో విమానాలు ప్రారంభమయ్యాక విడతల వారీగా ఇతర ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. త్వరలో కర్నూలులో విమానా సర్వీసులు నడువనుండడంతో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

VIDEOS

logo