అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల బీభత్సవాన్ని అరికట్టేందుకు దసరా తరువాత 8 కుంకి ఏనుగులు(Kunki Elephants) పంపేందుకు కర్ణాటక అంగీకరించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ మధ్య ఎంఓయూ ( MoU ) ఒప్పందం జరిగిందని వివరించారు. ఇటీవల కర్ణాటక వెళ్లి కుంకీ ఏనుగుల అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రమంత్రి, అటవీశాఖ అధికారులతో చర్చించామని తెలిపారు.
దేశంలో ఎక్కడా జరుగని విధంగా అటవీశాఖపై ఇరు రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్న దాఖలాలు లేవని వెల్లడించారు. ఆరు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు నిర్ణయించామని, మావటి, కావటిలకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి వారిలో సామర్ధ్యాన్ని పెంచనున్నామని వివరించారు.
ఏపీలో ఏనుగుల సంరక్షణ, వాటి ఆహారం తదితర అంశాలపై ఒప్పందం చేసుకున్నామన్నారు. ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, చిత్తూరు జిల్లాలో అధికంగా ఏనుగులు దాడులు చేస్తూ మనుషుల ప్రాణనష్టం, పంట నష్టం జరుగుతుందని వెల్లడించారు. కుంకీ ఏనుగుల వల్ల ఏనుగుల దాడులను అరికట్టే అవకాశం ఉందని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఏపీ, కర్ణాటక సంయుక్తంగా అరికట్టేందకు ఒప్పందం చేసుకున్నామని వివరించారు.