ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించిన స్థానిక వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు.. ఇటీవల తనకు తాను చెప్పుతో కొట్టుకుని పతాకశీర్శికలకెక్కారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆందోళన చేస్తున్న అఖిలపక్ష జేఏసీ.. బుధవారం వినూత్నంగా పడవలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ ర్యాలీ స్థానిక వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరగడం విశేషం.
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భీమవరం కాకుండా నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా పడవలతో ఆయన ర్యాలీ చేశారు. నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకూ ఆందోళన విరమించబోమని కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు.
నరసాపురం ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాదరాజును ఎన్నుకొని తప్పు చేశామని తనకు తాను చెప్పుతో కొట్టుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. గతంలో హ్యాట్రిక్ విజయాలతో మొత్తం ఐదుసార్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కొత్తపల్లి.. నిలకడలేమి రాజకీయాలతో తన ఇమేజ్ను దిగజార్చుకున్నారు. ప్రసాదరాజు, కొత్తపల్లి ఇద్దరూ వైసీపీలో ఉన్నప్పటికీ.. వీరి గత రాజకీయ వైరుధ్యాలు ఇప్పటికీ బయటపడుతున్నాయి. తనకు వైసీపీలో తగిన గుర్తింపు లేకపోవడంతో జిల్లా కేంద్రం ఆందోళనల బూచీతో ప్రజల మధ్య ఉండేందుకు కొత్తపల్లి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.