తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో(Vasantostavam) భాగంగా రెండవరోజైన మంగళవారం శ్రీ మలయప్పస్వామి(Malayappa Swamy) శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధులలో స్వర్ణరథంపై ఊరేగారు. ఉదయం అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవం(Golden Chariot)లో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు.
శ్రీవారికి శ్రీదేవి(Sridevi), భూదేవు(Budevi)లుంటారని అర్చకులు తెలిపారు. స్వామివారికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందమని తెలిపారు. బంగారం మహాశక్తిమంతమైన లోహమని శ్రీవారి ఇల్లు, ఇల్లాలు, ఇంట పాత్రలు, సింహాసనం బంగారమేనని వివరించారు.
ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్, ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్‌బాబు, వీజీవో బాలిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.