తిరుపతి : తిరుచానూరు పద్మావతి (Tiruchanur Padmavati ) అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ( Thirumanjanam ) శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు.
అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
పరదాలు విరాళం
ఈ సందర్భంగా ఆలయానికి హైదరాబాదుకు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి ఆరు పరదాలు, రెండు కురాళాలు, తిరుపతికి చెందిన సుధాకర్, జయ చంద్రారెడ్డి, అరుణ్ కుమార్ నాలుగు పరదాలు 25 హుండీ వస్త్రాలు విరాళంగా జేఈవో వీరబ్రహ్మంకు అందించారు.
నవంబరు 28 నుంచి బ్రహ్మోత్సవాలు
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 27వ తేదీన ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనున్నాయి.