అమరావతి : బ్రెయిన్ డెడ్ (Brain-dead) అయి అవయవదానం చేసే జీవన్మృతులకు ప్రభుత్వం తరుఫున అంత్యక్రియలు జరుపాలని ఏపీ ప్రభుత్వం(AP Government) నిర్ణయించింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అవయవదానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రిలోని డీన్, మెడికల్ సూపరింటెండెంట్ లేదా జీవన్‌దాన్(Jeevandan) కార్యక్రమంలో నమోదైన ఆస్పత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని సూచించింది.
ముందుగా ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్‌కు ఆలస్యం లేకుండా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. జీవన్మృతుడికి సంబంధించిన భౌతిక కాయానికి తగిన గౌరవం ఇస్తూ, ప్రభుత్వం తరుఫున అంత్యక్రియలకు రూ. 10 వేల ఆర్థిక సాయంతో పాటు జిల్లా కలెక్టర్ తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు హాజరు కావాలని సూచించింది.