Tadipatri | అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం జరిగిన ఉద్రిక్త ఘటనలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు, వైసీపీ నేత మురళి స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. గతంలో పెట్టిన కేసులు ఉపసంహరించుకోలేదని తనపై దాడి చేశారని పేర్కొన్నారు. వందల మంది టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని చెప్పారు. ఆత్మరక్షణలో భాగంగా లైసెన్స్ తుపాకీతో బయటకు వచ్చానని తెలిపారు. అంతేతప్ప తుపాకీతో ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక గన్మెన్లను తొలగించారని అన్నారు. గన్మెన్లను కేటాయించాలని కోరినా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, తాడిపత్రి అల్లర్ల ఘటనలో ఆరు కేసులు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరికొద్దిరోజులు తాడిపత్రికి రావద్దని సూచించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ఏర్పడిన ఘర్షణల కారణంగా టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలను పట్టణానికి దూరంగా ఉంచారు. కానీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం సాయంత్రం తాడిపత్రిలోకి అడుగుపెట్టారు. కేతిరెడ్డి వస్తున్నారన్న విషయం తెలియగానే ఎం.కొండాపురం వద్ద ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కానీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తాడిపత్రిలోని తన ఇంట్లో కొన్ని పత్రాలు ఉన్నాయని, వాటికోసం వెళ్తున్నానని చెప్పారు. దీంతో పోలీసులు ఆయన్ను వెంటబెట్టుకుని తాడిపత్రికి తీసుకొచ్చారు. ఆయనకు కావాల్సిన పత్రాలు తీసుకున్న తర్వాత అరగంటలోనే పోలీసు బందోబస్తు మధ్య అనంతపురానికి వెళ్లిపోయారు. అయితే కేతిరెడ్డి వెళ్లిపోయిన కాసేపటికే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. టీడీపీ శ్రేణులు కొందరు వెళ్లి వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ప్రతిఘటించిన మురళి తుపాకీతో బయటకు రావడం సంచలనంగా మారింది.