Srisailam Temple | శ్రీశైలం : ప్రముఖ శ్రీశైల దేవస్థానంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా కేదారగౌరీ వత్రాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో రెండు విడతల్లో వత్రాలు జరిగాయి. సామూహిక కేదారగౌరీ వ్రతాలకు చెంచులను సైతం దేవస్థానం ప్రత్యేకంగా ఆహ్వానించింది. స్థానిక చెంచులతో పాటు నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, కొత్తపల్లి, బండి ఆత్మకూరు, ఆళ్లగడ్డ, పల్నాడు జిల్లాలోని మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, ప్రకాశం జిల్లాలోని దోర్నాల, చింతల, మర్రిపాలెం, చిలకచెర్లగూడెం, బండంబావి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన చెంచులు హాజరయ్యారు. కార్యక్రమానికి చెంచులను ఎంపిక చేసే బాధ్యతను శ్రీశైలం దేవస్థానం స్థానిక గిరిజనాభివృద్ధి సంస్థకు అప్పగించింది. వ్రతాలకు హాజరైన భక్తులందరికీ పూజాద్రవ్యాలను దేవస్థానం సమకూర్చింది.
వ్రత కార్యక్రమంలో పాల్గొనే భక్తుల కోసం వేర్వేరుగా కలశాలను ప్రతిష్టించారు. మొదట కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని మహాగణపతి పూజ నిర్వహించారు. ఆ తర్వాత వేదికపై వేంచేపు చేసిన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు చేసి.. వ్రతాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అర్చకులు వ్రతకథను భక్తులకు వివరించారు. చివరకు మంత్రపుష్పంతో వ్రతం ముగిసింది. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు, పూజలు, గాజులు, కంకణాలు అందజేశారు. అలాగే, దేవస్థానం ఆధ్వర్యంలో ప్రచురించిన అష్టోత్తర శతనామకదంబ పుస్తకం, ఉసిరి, బిల్వం మొక్కలు ప్రసాదంగా అందజేశారు. అనంతరం వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన వసతి కల్పించారు.