(KE Krishnamurthy) కర్నూలు: మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కంటతడి పెట్టుకున్నారు. తన సొంతూరైన కంభాలపాడులో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేఈ కృష్ణమూర్తి హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత పెద్దాయన గ్రామానికి వస్తుండటంతో స్థానిక శ్రేణులు ఆయనకు గ్రాండ్గా స్వాగతం పలికారు. దాంతో వారు చూపిన అభిమానానికి భావోద్వేగానికి గురయ్యారు. కళ్లల్లో నీరు సుడులు తిరిగాయి. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. వైసీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కువైందని తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు త్వరలోనే చంద్రబాబును కంభాలపాడుకు తీసుకువస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికలలో టీడీపీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష పూరిత ధోరణి సాగుతుందని విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ భయపడకుండా టీడీపీ కార్యకర్తలు కార్యక్రమాలు చేపట్టడం తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. ఇదే ఉత్సాహంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో మనమే విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు.