Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 12 వరకూ కార్తీక మాసోత్సవాలు జరుగనున్నాయి. కార్తీక మాసోత్సవాల్లో శ్రీ భమరాంబికామల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి దేవస్థానం ఈవో డీ పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు. కార్తీక మాసోత్సవాల నిర్వహణ సన్నాహాలపై సోమవారం ఆయన సమీక్షించారు. భక్తులకు కల్పించే సౌకర్యాలన్నీ ముందస్తుగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, శుద్ధ, బహుళ ఏకాదశులు, ప్రభుత్వ సెలవు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని డీ పెద్దిరాజు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.
పాతాళ గంగ వద్ద శౌచాలయాలు, స్త్రీలు దుస్తులు మార్చుకునే గదులకు, పాతాళగంగ మెట్ల మార్గం తదితర చోట్ల అవసరమైన మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలని సిబ్బందికి పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు. గంగా భవానీ స్నాన ఘట్టాల వద్ద కూడా అవసరమైన మరమ్మతులు చేయించాలన్నారు.
భక్తులకు వసతుల కల్పన, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, శ్రీ స్వామి అమ్మవార్ల ఆర్జిత సేవలు, ఆలయ వేళలు, క్యూ లైన్ల నిర్వహణ, రద్దీ క్రమబద్దీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం, పార్కింగ్, కార్తీక సోమవారాల్లో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, పుణ్య నదీ హారతి ఏర్పాట్లు, కార్తీక మాసంలో ఆకాశ దీపం ఏర్పాట్లు, సాంస్క్రుతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు రద్దీ రోజుల్లో కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక విధుల అప్పగింత.