Mudragada | రాజకీయాల్లో నేతలు ఎన్నో సవాళ్లు విసురుకుంటారు.. కానీ వాటిపై మాత్రం అసలు నిలబడరు. కానీ ముద్రగడ మాత్రం చేసిన శపథానికి కట్టుబడి తన పేరును మార్చుకున్నారు. ఎన్నికల ముందు చేసిన సవాలు ఓడిపోవడంతో ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఈ మేరకు గురువారం ఒక గెజిట్ విడుదలైంది.
సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమ నేత ముద్రగడ తీవ్ర విమర్శలు గుప్పించారు. పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తానని.. ఒకవేళ పవన్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాలు విసిరారు. కానీ జూన్ 4వ తేదీన వచ్చిన ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ బంపర్ మెజార్టీతో గెలిచారు. దీంతో తెల్లారే మీడియా ముందుకొచ్చిన ముద్రగడ అన్నమాట ప్రకారం తన పేరును మార్చుకుంటున్నానని ప్రకటించారు. ఈ మేరకు గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసి డాక్యుమెంట్లు పంపించానని తెలిపారు. ఇప్పుడు ఆ గెజిట్ అధికారికంగా ఆమోదం పొందింది.