అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర జలవనరులశాఖ మెకానికల్ సలహాదారుడిగా కన్నయ్యనాయుడు (Kannayyanayudu) ను నియమించింది. ఈ మేరకు గురువారం నియమక ఉత్వర్వును జారీ చేసింది. ఇటీవల తుంగభద్ర డ్యాంకు చెందిన ఒక గేట్ కొట్టుకుపోయి నీరంతా సముద్రంలో కలిసి పోయింది. ఈ పరిస్థితుల్లో నీటిపారుదల రంగానికి చెందిన సీనియర్ ఇంజినీర్ కన్నయ్యనాయుడు సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది.
తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam)లో గల్లంతైన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ (Stop log ) ఏర్పాటు దగ్గరుండి చేయించి నీటి వృథాను అడ్డుకున్నారు. డ్యాంల గేట్లు తయారీలో నైపుణ్యం ఉన్న సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడిని చంద్రబాబుతో పాటు మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గేట్ల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం కన్నయ్యనాయుడిని సలహాదారుడిగా నియమించింది. ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు.