Srisailam Temple | శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శనివారం ఉదయం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలకు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ఆలయ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ఈవో కే పెంచలకిశోర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగా.. శ్రీశైలం దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు. అక్కడే పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తర్వాత మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రవేశం చేసి.. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కాణిపాకం ఆలయ స్థానాచార్యలు ఫణికుమారశర్మ, అర్చకస్వాములు గణేశ్ గురుకుల్, వేదపండితులు అభిరామ, అన్నపూర్ణయ్య, పర్యవేక్షకులు కే కోదండపాణి పాల్గొన్నారు.