అమరావతి : ఏపీలోని నిరుపేదలకు తక్కువ ధరకే కందిపప్పు(Kandipappu) ను రేషన్‌షాపుల ద్వారా అందించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) పేర్కొన్నారు. శనివారం గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో క్షేత్ర స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు.
పేదలకు అందించే బియ్యం పంపిణీ (Ration Supply) లో వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. రేషన్ బియ్యం దారి మళ్లించి కోట్లాది రూపాయాలను వైసీపీ పెద్దలు సంపాదించుకున్నారని విమర్శించారు. పేదలకు అందించాల్సిన రేషన్‌లో అవినీతి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కూటమికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ కూడా ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను అందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతల విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయని చెప్పారు.