తిరుమల : కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం ( Kaishika Dwadashi Aasthanam) వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువఝామున 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి ( Ugra Srinivasa murthy) ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారని వివరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారికి హుండీకి రూ. 3.81 కోట్లు ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 23 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 61,446 మంది దర్శించుకోగా 21,374 తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.81 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.