Kadiri | శ్రీసత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఈవో చేతివాటం ప్రదర్శించారు. అమ్మవారికి సంబంధించిన 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలను దొంగలించారు. అయితే వాటిని తరలించే సమయంలో అనుమానం వచ్చి స్థానికులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ దేవాలయ ఈవో మురళీకృష్ణ.. అమ్మవారికి సంబంధించిన 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులను దొంగలించాడు. వాటిని ఆటోలో తీసుకుని వెళ్తుండగా స్థానికులు గమనించారు. దీంతో ఆటోను ఆపి ఈవోను నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేక ఈవో నీళ్లు నమిలారు. దీంతో ఈవో మీద అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఈవో, ఆయన కుటుంబసభ్యులను అదే ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, ఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు