Sajjala Bhargava Reddy | వైసీపీ సోషల్‌మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ రెడ్డికి కడప పోలీసులు షాకిచ్చారు. భార్గవరెడ్డితో పాటు అర్జున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వారిద్దరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డిపై ఈ నెల 8వ తేదీన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అది కాకుండా ఏపీలో పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వాళ్లు విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్నోటీసులు జారీ చేశారు. వీరికోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా, గత శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని మణికొండ వద్ద భార్గవ రెడ్డి కదలికలను పోలీసులు ట్రేస్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, పోలీసుల విచారణలో వైసీసీ సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. సోషల్‌మీడియా ఇన్చార్జిగా సజ్జల భార్గవ్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నాకే తాము మరింత రెచ్చిపోయామని వర్రా రవీందర్ రెడ్డి తెలిపారు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని అతను బెదిరించేవాడని పేర్కొన్నారు. 2023 నుంచి తన ఫేస్బుక్ ఐడీతో సజ్జల భార్గవ రెడ్డినే పోస్టులు పెట్టేవారని చెప్పారు. ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్‌రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారని వివరించారు.