Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్డీగా కె.వెంకటకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కె.వెంకటకృష్ణ ప్రస్తుతం జీఏడీలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
ఇప్పటికే యువ అధికారి మధుసూదన్‌ను పవన్ కల్యాణ్‌కు ఓఎస్డీగా నియమించారు. కడప జిల్లా ఆర్డీవో పనిచేస్తున్న మధుసూదన్‌ను ఓఎస్డీగా నియమిస్తూ నాలుగు రోజుల క్రితం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
అంతకుముందు పవన్ కల్యాణ్ ఓఎస్డీగా యువ ఐఏఎస్ కృష్ణ చైతన్యను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఓఎస్డీలుగా గ్రూప్ 1 స్థాయి అధికారులు, ఆర్డీవోలను నియమిస్తుంటారు. కానీ తన తీరుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ ఐఏఎస్ అధికారి కృష్ణ చైతన్యను ఓఎస్డీగా నియమించాలని పవన్ కల్యాణ్ కోరారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా అనుమతించారు. కానీ కృష్ణ చైతన్య ప్రస్తుతం కేరళ రాష్ట్ర కేడర్‌లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ చైతన్యను డిప్యూటేషన్‌పై ఏపీకి పంపించాలని కేరళ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. త్వరలోనే కృష్ణచైతన్య కూడా డిప్యూటేషన్‌పై వచ్చే అవకాశం ఉంది.
కృష్ణ చైతన్య 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆయన స్వస్థలం. 2017లో కేరళలోని అలప్పి జిల్లాకు సబ్ కలెక్టర్‌గా ఆయనకు తొలి పోస్టింగ్ దక్కింది. అతి తక్కువ సర్వీసులోనే ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేసినప్పుడు వదర బాధితులను రక్షించేందుకు కీలకంగా వ్యవహరించారు. 48 గంటల్లో రెండున్నర లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులతో కలిసి భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. దీంతో ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా, టూరిజం శాఖ డైరెక్టర్‌గా, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం కృష్ణ చైతన్య త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు.