తిరుమల : తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం(Jyeshthabhishekam ) లో భాగంగా రెండో రోజు గురువారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి (Malayappa Swami) ముత్యపు కవచం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మలయప్పస్వామి ఉభయనాంచారులతో కూడిన విగ్రహాలను శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి చేర్చి శాస్త్రోక్తంగా మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు.
సాయంత్రం స్వామివారు ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిపించారు. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించే స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో తిరుమల (Tirumala) పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.