విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ (Justice Syed Abdul Nazeer) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ (Biswa Bhushan Harichandan) స్థానంలో అబ్దుల్ నజీర్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. బిశ్వభూషణ్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. వీరితోపాటు మరో 10 మంది గవర్నర్లు నియమితులయ్యారు.
అబ్దుల్ నజీర్.. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తర్వాత 2003లో కర్ణాటక హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులు అయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. అదేవిధంగా 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన ధర్మాసనంలో ఏకైక మైనారిటీ న్యాయమూర్తిగా ఉన్నారు.