తిరుమల తిరుపతి దేవస్థానానికి వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. మేల్ చాట్ వస్త్ర సేవ నిమిత్తం బుక్ చేసుకున్న ఓ భక్తుడికి.. ఆ సేవను అందించకపోవడాన్ని తప్పుపట్టింది. సదరు భక్తుడికి ఏడాదిలోగా ఆయన కోరుకున్న సేవను అందించాలని లేనిపక్షంలో రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని టీటీడీ ట్రస్ట్ బోర్డ్‌ను కోర్టు ఆదేశించింది.
తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన హరిభాస్కర్ అనే భక్తుడు 2006 లో తిరుమల శ్రీవారి మేల్ చాట్ వస్త్రం సేవ నిమిత్తం రూ.12,250 టీటీడీకి చెల్లించారు. 16 సంవత్సరాలు కావస్తున్నా ఆ భక్తుడికి మేల్ చాట్ సేవలో పాల్గొనే అవకాశం కల్పించలేదు. తనకు మేల్ చాట్ వస్త్ర సేవకు అవకాశం కల్పించాలని హరిభాస్కర్ పలుమార్లు టీటీడీకి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ టీటీడీ నుంచి ఎలాంటి స్పందన కనపడలేదు.
ఇలాఉండగా, కరోనా వ్యాప్తి సమయంలో మేల్ చాట్ వస్త్రం సేవకు బదులుగా వీఐపీ టికెట్ ఇస్తామని టీటీడీ అధికారులు ఆఫర్ ఇచ్చారు. అందుకు హరిభాస్కర్ అంగీకరించలేదు. తనకు మేల్ చాట్ వస్త్ర సేవే కావాలని డిమాండ్ చేశాడు. తన విజ్ఞప్తిని టీటీడీ పెడచెవిన పెట్టడంతో.. సేలంలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. హరిభాస్కర్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. తగిన రుసుం చెల్లించిన సదరు భక్తుడికి ఏడాదిలోపు మేల్ చాట్ వస్త్రం సేవను కల్పించాలని ఆదేశించింది. లేని పక్షంలో అతడికి రూ.50 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చిది.