Nagababu | ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభంజనంలా మారారు. పొత్తు కోసం మధ్యవర్తిత్వం వహించి ఎన్డీయే కూటమికి ఎవరూ ఊహించని విజయాన్ని అందించారు. పవన్ కల్యాణ్ అంటే పవనం కాదు.. ఓ తుఫాను అని ఏకంగా ప్రధాని మోదీతోనే అనిపించుకున్నారు. తమ్ముడికి దక్కిన ఈ సక్సెస్తో మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు కూడా సంతోషంలో మునిగిపోయారు. తన ఆనందాన్ని ట్విట్టర్ (ఎక్స్) ద్వారా పంచుకుంటూనే.. తమ ప్రత్యర్థులకు చురకలు అంటిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది.
ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మెగా బ్రదర్ ఒక ఫొటోను షేర్ చేశారు. అందులో మీసం తిప్పుతూ సీరియస్ లుక్లో నాగబాబు ఉన్నారు. ఈ ఫొటోకు నాగబాబు ఒక కొటేషన్ కూడా ఇచ్చారు. ‘ ఈ మీసం తిప్పింది జనసేనాని 100% స్ట్రైక్ రేటుతో కొట్టాడని కాదు.. కూటమి అఖండ విజయం సాధించిందని కాదు.. ఈ ధర్మపోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరఫున గర్వంతో తిప్పుతున్న ఈ మీసం..’ అంటూ ఓ రాసుకొచ్చారు. ఇది చూసిన పలువురు రాజకీయ విశ్లేషకులు వైసీపీ నాయకులను రెచ్చగొట్టేందుకే ఇలాంటి ట్వీట్చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఈ మీసం తిప్పింది ‘జనసేనాని’ 100% Strike Rate కొట్టాడని కాదు,
కూటమి అఖండ విజయం సాధించింది అని కాదు
ఈ ధర్మపోరాటం లో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరపున నేను గర్వంతో తిప్పుతున్నాను ఈ మీసం…!#jaijanasena #JAIPAWANKALYAN pic.twitter.com/Dg3bKNZk2Z— Naga Babu Konidela (@NagaBabuOffl) June 7, 2024
పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి తమ్ముడి వెంటే నాగబాబు ఉన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేశారు. నాగబాబు గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేశారు. కానీ వైసీపీ ప్రభంజనంలో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ.. తమ్ముడికి అండగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ పొత్తు ధర్మంతో పవన్ కల్యాణ్ ఆ సీటును బీజేపీకి త్యాగం చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ జనసేన విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ముఖ్యంగా పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి విజయం సాధించి.. అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబుకు ఇప్పించేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అదంతా వట్టి పుకార్లేనని ఆ వార్తలను నాగబాబు ఖండించారు. మరి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాగబాబుకు ఏ పదవి ఇస్తారో చూడాలి!