Perni Nani | పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఎందుకు ఓటెయ్యాలని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పడం లేదని.. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పడం లేదని అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన పార్టీలు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని మండిపడ్డారు. జెండా సభను జగన్‌ను తిట్టడానికే పెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌పై టన్నుల సమాచారం ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు ఎవరూ లొంగరని పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ దగ్గర బేరాలు ఉండవమ్మా.. పవన్‌కు చేతనైంది చేసుకోవచ్చు అని సవాలు విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 24 సీట్లు జనసేనకు కేటాయించిన దానిపై నిన్నటి మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. దానిపై కూడా పేర్ని నాని సెటైర్ వేశారు. 24 తీసుకుంటే గాయత్రి మంత్రం అయితే.. 10 తీసుకుంటే దశావతారం.. 9 తీసుకుంటే నవగ్రహాలు, 8 తీసుకుంటే అష్టదిక్కులు, 7 తీసుకుంటే సప్తరుషులు అని చెప్పొచ్చని ఎద్దేవా చేశారు. నువ్వు ఎన్ని సీట్లు తీసుకుంటే మాకెంటి బాధ అని పవన్‌ను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు దగ్గర టికెట్లు అమ్ముకొని కథలు చెబుతున్నారని విమర్శించారు.
తాడేపల్లిగూడెం మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ తనను తాను వామనుడిలా పోల్చుకుని.. శిబి చక్రవర్తిలా జగన్‌ను అధఃపాతాళానికి తొక్కేస్తానని వ్యాఖ్యానించారు. దీనిపైనా పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వామనుడు కాదు.. శల్యుడు, శిఖండిలాంటి వాడు అని ఎద్దేవా చేశారు. పార్టీని, పార్టీ నేతలు అందర్నీ శల్యుడిలా నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. జగన్‌ను కాదు.. చంద్రబాబునే పవన్ పాతాళానికి తొక్కుతారని విమర్శించారు. చంద్రబాబును పాతాళానికి తొక్కితేనే రాష్ట్రంలోని పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ వివేకా హత్య జరిగిందని పేర్ని నాని గుర్తు చేశారు. అప్పుడు .. అప్పుడు జగన్‌పై కేసు కాదు కదా.. నింద కూడా ఎందుకు మోపలేదని ప్రశ్నించారు. ఇప్పుడు హు కిల్డ్ బాబాయ్ అని అరుస్తున్నారని మండిపడ్డారు. ముందుగా హు కిల్డ్ ఎన్టీఆర్ అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పల్లకిని మోయడనే పవన్ కళ్యాణ్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం ఎంత కష్టమో.. పవన్‌ను నమ్ముకుని రాజకీయం చేయడం కూడా అంతే కష్టమని ఎద్దేవా చేశారు.