అమరావతి: 28మంది ఎంపీలతో వైసీపీ సాధించింది శూన్యం అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవడంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని” ఆయన తెలిపారు. “జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉన్న పోలవరానికి 2022-23 బడ్జెట్లో కేటాయింపులు కనిపించలేదంటే వైసీపీ తరఫున ఉన్న 22మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఏం సాధించినట్లు? ఈ పరిస్థితి చూస్తుంటే- కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడుగానీ, సంబంధిత అధికారులతో చర్చలలో పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా అనే సందేహంకలుగుతోందని” పవన్ పేర్కొన్నారు.
“ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రకటనల్లో మాత్రం పోలవరం గురించి అడిగాం అంటారు. కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం అందుకున్న నిధులు కేవలం రూ.5163.2 కోట్లు మాత్రమే. ఈ విధంగా అయితే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుంది? యమునకు ఉప నదులైన కెన్-బెత్వా ప్రాజెక్ట్ కోసం రూ.44వేల కోట్లు ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. అంటే కేంద్రం జలవనరుల రంగానికి సానుకూలంగా నిధులు ఇస్తోంది. సాధించడంలోనే వైసీపీ ప్రభుత్వం అలసత్వం కనిపిస్తోంది.
కేంద్రం దగ్గర రాష్ట్ర అవసరాలను, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను…. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా బహుళార్ధ సాధకమో వివరించి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 30.7 లక్షల ఎకరాలకు సాగు అవసరాలు, 28 లక్షల మందికి తాగు అవసరాలు తీరుతాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని” పవన్ విమర్శించారు.