హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో తాము విజయం సాధించినా భవిష్యత్తులో వైసీపీని ఇబ్బంది పెట్టబోమని, ఇది కక్ష సాధింపు సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి విజయం అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ, ఇది ఐదు కోట్ల మంది పైచిలుకు ప్రజలకు సేవ చేసే సమయమని పేర్కొన్నారు. ‘ఏపీ విభజన తర్వాత నుంచి మనం చీకట్లో నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయాయి. కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది. నా జీవితమం తా తిట్టించుకున్నా.. మాటలు పడ్డా.. భారతదేశంలో వందకు వందశాతం విజయం సాధించింది జనసేన పార్టీ’ అని చెప్పారు. మార్పుకావాలనేది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అని, అదే ఓటు ద్వారా స్పష్టం చేశారని తెలిపారు.
ఏపీ బలమైన భవిష్యత్తుకు పునాది వేసే సమయం ఆసన్నమైందన్నారు. తాను ఏరు దాటాక తెప్ప తగలేసే మనిషిని కాదని చెప్పారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ఏడాదిలోగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని, మెగా డీఎస్సీ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. తనకు ప్రజలు పెద్ద బాధ్యత ఇచ్చారని, 175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో 21కి 21 సీట్లు గెలిస్తే కూడా అంతే బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా అధికారులకు పనిచేసే స్వేచ్ఛనిస్తామని, రైతులకు ఇబ్బందుల్లేని ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పారు. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలందరికీ, పెద్దలకు, ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు, యువతకు కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు.