అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు (Jallikattu) సంబరాలు ఏపీలో ముందుగానే ప్రారంభమయ్యాయి. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ( Chittoor district ) ప్రారంభం కాగా నెలరోజుల పాటు కొనసాగ నున్నాయి. తమిళనాడు (Tamilnadu) సంస్కృతిలో భాగమైన జల్లికట్టు సమీప జిల్లాల వాసులు కూడా కొన్నేళ్ల నుంచి జల్లికట్టు ప్రారంభించారు.
ప్రతి యేట జనవరి 1వ తేదీన ఘనంగా నిర్వహించి ప్రతిరోజు సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గo బైరెడ్డిపల్లి మండలం గౌనీతిమ్మేపల్లి గ్రామంలో కోడెద్దుల పరుగు పందెంను(జల్లికట్టు) తిలకించడానికి గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎద్దులను పరుగుకు వదిలే ముందు వాటి కొమ్ములకు బహుమతులు కట్టి వదులుతారు. కొమ్ములకు కట్టిన బహుమతులను లాక్కోవడం కోసం ప్రాంగణంలో యువత పోటీ పడుతుంటారు.
ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన జల్లికట్టులో ఎద్దులను ఆపే క్రీడల్లో భాగంగా ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఈ సంబరాలకు నిర్వాహకులతో పాటు స్థానిక అధికారులు, పోలీసులు, ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.